

తన అద్భుత ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న భారత యువ పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి సోషల్ మీడియాలో వేధింపులు ఎదురయ్యాయి. ఐపీఎఫ్ ప్రపంచ సబ్‌జూనియర్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో కేయా రజత పతకం సాధించింది. కేవలం 21 ఏళ్ల వయసులో తన శరీర బరువుకు మూడు రెట్లకుపైగా ఉండే 140 కిలోల బరువును డెడ్‌లిఫ్ట్ చేయడంతో ఆమె ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ గుర్తింపుతో పాటు చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయని కేయా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. తనపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, తన పేరుతో నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
తన జాతి, వంశం, కులం గురించి అసహ్యకరమైన చర్చలు జరుగుతున్నాయని కేయా తెలిపింది. అన్నింటికంటే దారుణంగా తన ముఖం, శరీరాన్ని ఉపయోగించి వేలాది ఏఐ చిత్రాలను తన అనుమతి లేకుండా రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. తాను వ్యక్తిగత ఖాతాల నుంచి ఫొటోలు షేర్ చేయనని, గతంలో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సుమారు 300 మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారని తెలిపింది. ఆ ఖాతా సస్పెండ్ కావడంతో కొత్త ఖాతా ద్వారా ఈ విషయాలను వెల్లడిస్తున్నానని చెప్పింది. పవర్‌లిఫ్టింగ్ తనకు ఎంతో ఇష్టమైన ప్రయాణమని, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే అవకాశం లభించడం పట్ల సంతోషంగా ఉన్నానని, అయితే అనుమతి లేకుండా రూపొందిస్తున్న ఏఐ చిత్రాలు తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తున్నాయని కేయా పేర్కొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!