

తెలంగాణ రాజకీయాల్లో మరో ఉపఎన్నికకు దారితీసే పరిణామాలు వేగం పుంజుకుంటున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ పెరిగింది. ఇటీవల స్పీకర్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగుతుండగా, కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్ అందరికీ నోటీసులు జారీ చేశారు.
పది మందిలో ఎనిమిది మంది మాత్రమే తమ వివరణలు సమర్పించగా, కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం స్పందించలేదని తెలిసింది. దీంతో గురువారం స్పీకర్ వీరికి మరోసారి నోటీసులు అందజేసి, వెంటనే అఫిడవిట్లు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు ఈ అనర్హత పిటిషన్లపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించిన నేపథ్యంలో విచారణ దాదాపు పూర్తికి చేరింది.
దానం నాగేందర్ విషయంలో మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఇటీవల ఆయన సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నోటీసులకు వివరణ ఇచ్చినా, విచారణలో ప్రతికూలతలు ఎదురయ్యే ప్రమాదం ఉండొచ్చని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజీనామా చేసి ఉపఎన్నికను ఎదుర్కోవడం రాజకీయంగా సురక్షితమని దానం ఆలోచిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది.
ఇదిలా ఉండగా, ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలవడం, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో పార్టీ బలంగా నిలుస్తోందని భావన ఏర్పడింది. ఈ వాతావరణంలో ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక జరిగితే కాంగ్రెస్ విజయం సులభమవుతుందని పార్టీ నేతల అంచనా. దానం తిరిగి గెలిస్తే మంత్రి పదవి కోసం చర్చించే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
ఈ పరిణామాల నడుమ దానం నాగేందర్ గురువారం ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ పెద్దలను కలుసుకున్నారు. రాజీనామా తర్వాతి రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించినట్లు సమాచారం. తన రాజీనామా తర్వాత ఉపఎన్నికలో గెలుపు ఖాయం అని, అనంతరం మంత్రివర్గంలో చోటు పరిశీలించాలని ఆయన కేంద్ర నేతలకు సూచించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎప్పుడైనా దానం తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని ఆయన సమీప వర్గాలు అంటున్నాయి.
దానం నాగేందర్ గత రాజకీయ ప్రయాణం కూడా చర్చనీయాంశం. కాంగ్రెస్‌లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, తర్వాత టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటయ్యాక టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో ఆసిఫ్‌నగర్‌లో ఉపఎన్నిక జరిగింది. 2009లో ఖైరతాబాద్ నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి మంత్రి అయ్యారు. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరి గెలిచారు.
ఇప్పుడు మరోసారి దానం నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!