

భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇథియోపియా పర్యటనలో అరుదైన గౌరవం లభించింది. తొలిసారిగా ఇథియోపియాను సందర్శించిన మోదీకి, ఆ దేశ ప్రభుత్వం అత్యున్నత జాతీయ పురస్కారం “గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా”ను ప్రధానం చేసింది. అదిస్ అబాబాలోని అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబి అహ్మద్ అలీ స్వయంగా ఈ అవార్డును అందజేశారు.
జోర్డాన్ పర్యటనను ముగించుకుని మంగళవారం అదిస్ అబాబా చేరుకున్న మోదీకి విమానాశ్రయంలోనే ఇథియోపియా ప్రధాని అబి అహ్మద్ అలీ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా విస్తృత స్థాయి చర్చలు జరిగాయి.
ఇంతకుముందు జోర్డాన్ రాజధాని అమ్మాన్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, వచ్చే ఐదేళ్లలో భారత్–జోర్డాన్ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ రెట్టింపు అయి 500 కోట్ల డాలర్లకు చేరుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వృద్ధిలో భాగస్వాములుగా మారాలని జోర్డాన్ వ్యాపార సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా–IIతో కలిసి ద్వైపాక్షిక వాణిజ్య వేదికను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సమావేశంలో యువరాజు హుసేన్తో పాటు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రులు కూడా పాల్గొన్నారు.

మోదీ జోర్డాన్ పర్యటన సందర్భంగా సంస్కృతి, పునరుత్పాదక ఇంధనం, జల నిర్వహణ, డిజిటల్ మౌలిక వసతులు, పెట్రా–ఎల్లోరా మధ్య సహకారం వంటి రంగాల్లో భారత్, జోర్డాన్లు పలు ఒప్పందాలకు సంతకాలు చేశాయి.
ఈ పర్యటనలో మరో విశేష ఘటన చోటు చేసుకుంది. జోర్డాన్ యువరాజు అల్ హుసేన్ బిన్ అబ్దుల్లా–II స్వయంగా కారు నడుపుతూ ప్రధాని మోదీని అమ్మాన్‌లోని చారిత్రక జోర్డాన్ మ్యూజియానికి తీసుకెళ్లారు. దేశ చరిత్రను వివరించడం ద్వారా ఇరుదేశాల మధ్య ఉన్న గాఢమైన స్నేహబంధానికి ఇది ప్రతీకగా నిలిచింది. యువరాజు హుసేన్, ఇస్లాం ప్రవక్త మొహమ్మద్‌కు 42వ తరం వారసుడిగా గుర్తింపు పొందారు.
.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!