

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం తన ఇలవేల్పు కొండగట్టు ఆంజనేయస్వామి వారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు. స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని ఇచ్చిన హామీ మేరకు, రూ.35.19 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ సహకారంతో దీక్ష విరమణ మండపం మరియు 96 గదుల సత్రం నిర్మాణాలకు శంకుస్థాపన చేసేందుకు ఆలయానికి విచ్చేశారు.
ఉదయం 11 గంటల సమయంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో కలిసి ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యార్ ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం లభించింది. ప్రధాన స్థానాచార్యులు కపీంద్ర స్వామి సంప్రదాయబద్ధంగా ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం ఆంజనేయస్వామితో పాటు వెంకటేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఈవో టి. శ్రీకాంతరావులు, జనసేన నేతలు, టీటీడీ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!