

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మళ్లీ వేగం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధం కావడంతో గ్రామాల్లో ఎన్నికల హడావిడి ఒక్కసారిగా పెరిగింది. పోటీకి రంగంలోకి దిగాలనుకునే అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రిజర్వేషన్ల కేటాయింపులకు అనుగుణంగా తమ గ్రామాల్లో రాజకీయ సమీకరణలను పరిశీలిస్తూ వ్యూహాలు రచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. పారదర్శకంగా, ఎలాంటి లోపాలు లేకుండా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశించింది. ఈ సూచనలతో మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలనే నిర్ణయంపై ప్రభుత్వం ముందుగానే స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 15 నుంచి 20 వ తేదీ మధ్య ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇప్పటికే గత నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ, ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సమయంలో బీసీ రిజర్వేషన్లపై కోర్టు స్టే రావడంతో ఆ ఎన్నికలు నిలిచిపోయాయి. ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా ఎన్నికల సంఘం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఇదిలా ఉండగా, గ్రామాల్లో పాలకవర్గాలు లేక దాదాపు 18 నెలలు గడవడంతో ప్రజలు కూడా ఈ ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడంతో పోటీ చేసే అభ్యర్థులు సంఖ్య గణనీయంగా పెరుగుతోందని సమాచారం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!