

రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అప్పుల పాల్జేసిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలకల్లో నాలుగు విద్యుత్తు ఉపకేంద్రాల ప్రారంభం, ఎర్రవల్లిలో 220 కేవీ ఉపకేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, గత ప్రభుత్వం రూ.8.21 లక్షల కోట్లు అప్పుల భారాన్ని ప్రజలపై మోపిందని ఆరోపించారు. ఇప్పటికే ఆ అప్పుల్లో రూ.2 లక్షల కోట్లు చెల్లించామని తెలిపారు. ఇంతటి పరిస్థితుల్లో కూడా మళ్లీ గెలుస్తామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు.
తుమ్మిళ్ల పథకం రైతులకు ఉపయోగపడడం లేదని, రిజర్వాయర్ లేకుండా ఎత్తిపోతల వ్యవస్థ అమలు చేసిన ఏకైక ఉదాహరణ ఇదేనని విమర్శించారు. త్వరలో మల్లమ్మకుంట రిజర్వాయర్ పూర్తి చేసి నీటి నిల్వ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల 12 విద్యుత్తు ఉపకేంద్రాలు ప్రారంభిస్తున్నామని, నాణ్యమైన విద్యుత్తు సరఫరా లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. విద్యుత్తుశాఖలో అంబులెన్స్ సేవలను ప్రారంభించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!