

అమరావతి రాజధానిలో రైతుల సమస్యలకు న్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. శనివారం రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో భూములు ఇచ్చిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, రాజధానిలో లంక భూముల అంశం పూర్తిగా క్లియర్ అయిందని తెలిపారు.
గ్రీన్ బఫర్ జోన్ అంశంలో తుళ్లూరులో కొన్ని అభ్యంతరాలు వచ్చాయని, దీని వల్ల మొదట 36 ఫ్లాట్లు ప్రభావితమయ్యాయని చెప్పారు. అయితే ఆ సంఖ్యను కేవలం మూడు ఫ్లాట్లకు తగ్గించినట్లు వెల్లడించారు. ఈ సమస్యను పరిష్కరించిన మంత్రి నారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పటివరకు 2004 మంది రైతులు ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇవ్వలేదని, వారితో మరోసారి చర్చలు జరుపుతామని చెప్పారు. అలాగే 120 మంది రైతులు ల్యాండ్ ఆల్టర్నేటివ్ అయినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. రోడ్డు శూల ఉన్న భూములకు అవసరమైన వాక్‌వేలను సరిచేస్తామని తెలిపారు. వాస్తు అంశం అంతులేనిదని, ప్రతిసారి దానిని అనుసరించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
ఎఫ్ఎస్ఐ తక్కువగా ఉందని రైతులు కోరుతున్న విషయంపై పునరాలోచన చేయనున్నట్లు చెప్పారు. అవకాశం ఉన్నప్పుడు మాత్రమే మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. 26 గ్రామాలకు డీపీఆర్‌లు అందిస్తామని, సోమవారం నుంచి రెండు వైపులా బౌండరీ స్టోన్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా 18 కమ్యూనిటీ హాల్స్ అవసరమని రైతులు కోరారని, స్మశానాల అంశంపై మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కలిసి చర్చిస్తారని కేంద్ర మంత్రి వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!