

రాష్ట్ర శాంతిభద్రతల విషయంలో తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎలాంటి రాజీ పడబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజకీయాల ముసుగులో నేరాలు చేసే వారిని ఉపేక్షిస్తే ప్రజల భద్రత ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు.
పోలీస్ వ్యవస్థ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, నేరాల తీరు మారుతున్నందున ముందస్తుగా అంచనా వేసే విధంగా పనిచేయాలని సూచించారు. పోలీసులకు రాష్ట్రంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, సమర్థులకే పెద్దపీట వేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే శాంతిభద్రతలు అత్యంత కీలకమని చెప్పారు.
మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఒకప్పుడు నేరస్థులు రాజకీయాల్లోకి రాకపోయేవారని, కానీ గతంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. నేరాలు చేసే వారు మనకంటే తెలివైనవాళ్లు కాదని, పోలీసుల సమర్థత పై భయం ఉంటే నేరాలే జరగవని స్పష్టం చేశారు. పోలీసులు బయట కనిపించకుండా మూడో నేత్రంలా పనిచేయాలని, సాంకేతికతను ఉపయోగించి నేరాల్ని కట్టడి చేయాలని సూచించారు. మహిళల పట్ల తనకు గౌరవముందని, కానీ గత ప్రభుత్వంలో మహిళలను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
పోలీస్ నియామకాల విషయంలో గత ప్రభుత్వం కాలయాపన చేసిందని, ప్రస్తుతం కోర్టు అడ్డంకులు ఉన్నప్పటికీ పారదర్శకంగా నియామకాలు పూర్తి చేశామని చెప్పారు. ఈ నియామకాల్లో ఎలాంటి రాజకీయ సిఫార్సులు చేయలేదని స్పష్టం చేశారు. ఈసారి మొత్తం 6,014 మంది పోలీస్ అభ్యర్థులు ఎంపికయ్యారని, అందులో 3,043 మంది సివిల్ కానిస్టేబుళ్లు, 2,414 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు, 993 మంది మహిళలు, 183 మంది గిరిజన యువత ఉన్నారని వివరించారు.
శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు ఇచ్చే స్టైపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,500 కి పెంచుతున్నట్లు సీఎం ప్రకటించగా, అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు, భద్రత కల్పించే బాధ్యత తమదేనని చంద్రబాబు తేల్చిచెప్పారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!