

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో రాత్రి వేళల్లోనూ ఆర్థిక కార్యకలాపాలను పెంచే దిశగా చర్యలను వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో రాత్రిపూట వ్యాపారం, ఉద్యోగావకాశాలు, వాణిజ్యం, సాంస్కృతిక కార్యక్రమాలు, టూరిజం రంగాలను మరింత అభివృద్ధి చేసే విధంగా సమగ్ర వ్యూహం సిద్ధం చేస్తున్నారు.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పటికే దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో నైట్ ఎకానమీని దృఢంగా చేసేందుకు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.
హైదరాబాద్ నగరంలో రాత్రి వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, రాష్ట్రోత్సవాలు, హెరిటేజ్ వాక్‌లు నిర్వహించడం, ఆధునిక ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయడం ద్వారా సందర్శకులను ఆకర్షించడంతో పాటు చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు మరింత భరోసా కల్పించే ఉద్దేశం ఉంది. రాత్రి వేళల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక వ్యవస్థను కూడా రూపుదిద్దుతున్నారు. అలాగే బుకింగ్‌లు మరియు అనుమతుల కోసం ఒకే చోట సేవలు అందించే సింగిల్ విండో ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్‌లో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు, వ్యాపార రంగంలో పనిచేసే వారు రాత్రింబవళ్లూ పనిచేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర జీఎస్డీపీకి హైదరాబాద్ ప్రధాన ఆధారంగా ఉన్నందున, నైట్ టైమ్ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇందులో భాగంగా ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమిట్‌లో ప్రవేశపెట్టనున్న ’తెలంగాణ రైజింగ్ విజన్–2047’ పత్రంలో వచ్చే 20 ఏళ్ల అభివృద్ధి దిశ, వ్యూహాలు, లక్ష్యాలకు సంబంధించిన సమగ్ర నివేదికను సిద్ధం చేసింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!