

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో డబ్బు, మద్యం విచ్చలవిడిగా ప్రవహించాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తం ఎన్నికల ఖర్చు ₹11 వేల కోట్లను దాటినట్టు అంచనాలు వేస్తున్నారు. ఇది పంచాయతీ ఎన్నికల చరిత్రలోనే రికార్డుగా అభివర్ణిస్తున్నారు.
గెలవాలనే లక్ష్యంతో చాలా గ్రామాల్లో అభ్యర్థులు పోటాపోటీగా ఖర్చు చేశారు. గెలిచిన అభ్యర్థులు సగటున ₹50 లక్షల నుంచి ₹60 లక్షల వరకు, ఓడిన అభ్యర్థులు సుమారు ₹40 లక్షల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. బరిలో ఉన్న ఇతర అభ్యర్థులు సుమారు ₹10 లక్షల వరకు ఖర్చు చేశారు. వార్డు సభ్యులు కూడా తమ సామర్థ్యాన్ని బట్టి ఖర్చు పెట్టారు.
దీంతో సగటున ఒక్కో గ్రామంలో సర్పంచ్ ఎన్నికల పేరుతో దాదాపు ₹కోటి వరకు ఖర్చు జరిగినట్టు అంచనా.
రాష్ట్రంలోని 12,728 గ్రామాల్లో మూడు దశలుగా ఎన్నికలు జరిగాయి. వీటిలో సుమారు 1,200 గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. మిగిలిన 11,528 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగగా, ఈ గ్రామాల్లోని మొత్తం ఖర్చు కలిపితే రాష్ట్రవ్యాప్తంగా ₹11 వేల కోట్లకు పైగా వ్యయం జరిగి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
గతంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లకు నేరుగా డబ్బు పంపిణీ చాలా అరుదుగా ఉండేది. కుల సంఘాల సమావేశాలు నిర్వహించడం, గ్రామ అవసరాలు తీర్చడం, యువతకు క్రీడా సామగ్రి ఇవ్వడం వంటి మార్గాలు అనుసరించేవారు. కానీ ఈసారి ఓటుకు డబ్బు పంపిణీ సాధారణ విషయంగా మారింది.
ఎన్నికల్లో పోటీ చేసిన చాలా మంది అభ్యర్థులు ధనవంతులు కాదు. నాలుగు లేదా ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులే ఎక్కువగా బరిలో నిలిచారు. ఓడిపోతే పరువు పోతుందన్న భయంతో ఖర్చుకు వెనుకాడలేదు. ఇందుకోసం పలువురు భూములు, బంగారం అమ్మడం, మరికొందరు ఆస్తులు కుదువబెట్టి డబ్బు సమకూర్చుకోవడం చేశారు.
చాలా గ్రామాల్లో ఓటుకు ₹1,000 పంపిణీ చేయగా, కొన్ని చోట్ల ₹2,000 నుంచి ₹3,000, పోటీ ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ₹5,000 వరకు ఇచ్చినట్టు సమాచారం. పోలింగ్‌కు ముందు రోజు ఇంటికి కిలో చికెన్ పంపిణీ, మహిళలకు చీరలు, గిన్నెలు, ఉంగరాలు వంటి వస్తువులు, పురుషులకు మద్యం బాటిళ్లు పంపిణీ చేశారు. అంతేకాకుండా ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలకు రాత్రిపూట మద్యం ఇవ్వడం పరిపాటిగా మారింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!