

హల్ద్వానీ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించిన తీరుకు నాగర్‌కర్నూల్ లోక్‌సభ సభ్యుడు డా. మల్లు రవి కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ గాంధీకి రాసిన లేఖలో, హల్ద్వానీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశం జరిగిన ప్రదేశంలో నిర్వహించినట్లు పేర్కొన్న ‘శుద్ధీకరణ’ కార్యక్రమం ఎస్సీ, ఎస్టీ వర్గాల గౌరవాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. ఈ అంశంపై రాహుల్ గళమెత్తడం దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ధైర్యాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
అంటరానితనాన్ని నిషేధించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 17ను ప్రస్తావించిన మల్లు రవి, కుల వివక్షకు భారత రాజ్యాంగంలో ఎలాంటి స్థానం లేదన్నారు. హల్ద్వానీ ఘటనపై ప్రశ్నించిన అనంతరం రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శుద్ధీకరణ కార్యక్రమం నుంచి అనంతరం నమోదైన ఫిర్యాదులు, పోలీసుల స్పందన వరకు మొత్తం వ్యవహారంపై నిష్పక్షపాత, పారదర్శక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం ఎంపీగా అంటరానితనం, కుల వివక్ష, సామాజిక అవమానాలకు వ్యతిరేకంగా పోరాడటం తన రాజ్యాంగ, నైతిక బాధ్యత అని తెలిపారు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వ స్ఫూర్తిని కాపాడేందుకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!