

22ఏ జాబితాలో చేర్చిన భూములకు వెంటనే విముక్తి కల్పించాలని, లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హెచ్చరించారు. ధరణి కంటే భూభారతి మరింత దారుణంగా మారిందని విమర్శించారు. 22ఏ జాబితాలో జరిగిన పొరపాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా అంగీకరించారని, వాటిని తక్షణమే సరిదిద్దాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 22ఏ భూముల సమస్యపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కూడా రాంచందర్‌రావు కోరారు.
జూబ్లీహిల్స్‌లోని సర్వే నంబర్ 403లో కేవలం రెండు ప్లాట్లు మాత్రమే ప్రభుత్వ భూములని, మిగతా భూములను కూడా 22ఏ జాబితాలో చేర్చారని రాంచందర్‌రావు ఆరోపించారు. ఇదే జాబితాలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి నివాసం ఎలా తొలగించబడిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం నివాసం తొలగింపునకు సంబంధించి దరఖాస్తును బహిర్గతం చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కోరగా, ఎలాంటి దరఖాస్తు లేకుండానే నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించారనే ఆరోపణలు చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా భూవివాదాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!