

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు స్పందించారు. కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారని కేటీఆర్ పదేపదే ప్రశ్నిస్తున్నారని, అయితే గత పదేళ్లలో తెలంగాణ రైతుల సమస్యలపై ఆయన ఏ మేరకు పోరాడారో చెప్పాలని వంశీకృష్ణ ప్రశ్నించారు. గతంలో బీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీలు ఉన్నప్పటికీ రామగుండం ఎరువులు, రసాయనాల సంస్థ అంశంపై పార్లమెంట్‌లో లేదా అసెంబ్లీలో ఒక్కసారైనా పోరాటం చేశారా అని నిలదీశారు. రామగుండం ఎరువుల సంస్థ ఉత్పత్తి, తెలంగాణలో యూరియా సరఫరా అంశాలు రైతులకు కీలకమైనవని పేర్కొన్నారు. ఎంపీ వంశీకృష్ణ స్వయంగా రామగుండం ఎరువుల సంస్థ ఉత్పత్తి సామర్థ్యం, తెలంగాణలో యూరియా పంపిణీపై పార్లమెంట్‌లో ప్రశ్నలు లేవనెత్తిన విషయం అధికారిక రికార్డుల్లో ఉంది.
కాకా వెంకటస్వామి, వివేక్ గడ్డం రామగుండం ఎరువుల సంస్థకు సంబంధించిన రుణ సమస్య పరిష్కారం, కార్మికులకు ఉపాధి కల్పించడం, తెలంగాణ రైతులకు యూరియా అందించేందుకు కృషి చేశారని వంశీకృష్ణ పేర్కొన్నారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో కేటీఆర్ రైతుల తరఫున రామగుండం ఎరువుల సంస్థ అంశాన్ని పార్లమెంట్‌లో లేదా అసెంబ్లీలో ప్రస్తావించారా అని ప్రశ్నించారు. “తెలంగాణ గురించి, తెలంగాణ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదు” అని వ్యాఖ్యానించారు. అలాగే కేటీఆర్‌పై భూకబ్జాలు, దోపిడీలకు సంబంధించిన ఆరోపణలు చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. “ఖబర్దార్ కేటీఆర్.. మీరు ప్రతిపక్షంలో ఓడిపోయిన నాయకుడి స్థాయిని మించి ఇంకేమీ కాలేరు” అని వంశీకృష్ణ అన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!