

ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జు-యే మరోసారి బహిరంగంగా కనిపించింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నాయకుల స్మారక ప్రదేశమైన కుమ్సుసన్ ప్యాలెస్ ఆఫ్ ద సన్ ను ఆమె సందర్శించింది. ఈ కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్‌తో పాటు ఆయన భార్య రి సోల్ జు, కుమార్తె జు-యే మరియు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
గత మూడేళ్లుగా కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెను అధికారిక కార్యక్రమాలకు తీసుకువెళ్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అధికార బాధ్యతలను ఆమెకే అప్పగించే సూచనలు ఉన్నాయని దక్షిణ కొరియా నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ విషయం పై కిమ్ త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముందన్న ప్రచారం కూడా కొనసాగుతోంది.
ముందుగా 2022 లో కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెను తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు. అనంతరం 2023 లో ప్యాంగ్యాంగ్లో నిర్వహించిన మిలిటరీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆమె మళ్లీ కనిపించింది. అప్పటి నుంచి పలు అధికారిక కార్యక్రమాల్లో జు-యే పాల్గొనడం ఆమె వారసురాలన్న వార్తలకు బలం చేకూరుస్తోంది.
దక్షిణ కొరియా నిఘా వర్గాల సమాచారం ప్రకారం కిమ్ జోంగ్ ఉన్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో సంతానంగా జన్మించిన జు-యే అధికార పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని అక్కడి అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. కిమ్ జోంగ్ ఉన్ కూడా వంశపారంపర్యంగానే అధికారంలోకి వచ్చారు. ఆయన తండ్రి కిమ్ జోంగ్-ఇల్ 2011లో మరణించిన అనంతరం దేశ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!