

ప్రభుత్వ అధికారులు పనులను సకాలంలో పూర్తి చేస్తే వారికి స్వచ్ఛందంగా ‘టిప్’ లేదా ‘గౌరవ వేతనం’ ఇవ్వడంలో తప్పులేదని కర్ణాటక మంత్రి కె.ఎం. శివలింగే గౌడ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. హసన్ జిల్లాలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో ఓ వ్యక్తి.. ప్రభుత్వ అధికారులు పనులు పూర్తి చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీనిపై స్పందించిన మంత్రి.. అధికారులు తమ విధులను సకాలంలో పూర్తి చేస్తే వారికి ఇష్టపూర్వకంగా డబ్బు ఇవ్వడంలో తప్పులేదన్న భావనలో వ్యాఖ్యలు చేశారు. దీంతో కార్యక్రమానికి హాజరైన పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
వివాదం ముదరడంతో హసన్ డిప్యూటీ కమిషనర్ కె.ఎస్. లతా కుమారి జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. లంచం డిమాండ్ చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు తన వ్యాఖ్యలను మంత్రి శివలింగే గౌడ వివరణ ఇచ్చారు. నిజాయతీగా పనిచేసే అధికారులను గౌరవించాలన్నదే తన ఉద్దేశమని, లంచాలను ప్రోత్సహించడం తన ఉద్దేశం కాదని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై భాజపా తీవ్రంగా స్పందించింది. భాజపా ఎమ్మెల్సీ సీటీ రవి మంత్రి వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!