

గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ ఇండియా కూటమి నేతలతో సమావేశమయ్యారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఎన్నికల సంఘం వ్యవహారంపై కూటమి తరఫున చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై చర్చించారు. అక్టోబర్ 6న కూటమి పార్టీలన్నీ కలిసి జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి, జిల్లా అధికారుల కార్యాలయాల వద్ద నిరసనలు చేపడతామని మహేశ్ గౌడ్ తెలిపారు. అక్టోబర్ 8న లోక్ భవన్‌ను ముట్టడిస్తామని, నవంబర్ 1న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. SIRపై ఇండియా కూటమి దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి 8 వరకు నిరసన కార్యక్రమాలకు ఇప్పటికే పిలుపునిచ్చింది.
SIR ప్రక్రియలో అర్హత కలిగిన ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని, బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆయన విమర్శించారు. ఎన్నికల సంఘంపై కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవి కాంగ్రెస్, ఇండియా కూటమి చేసిన ఆరోపణలు కాగా.. ఎన్నికల సంఘం SIR ప్రక్రియను సమర్థిస్తోంది. బీజేపీ కూడా విపక్షాల ఆరోపణలను ఖండిస్తూ, ఓటర్ల జాబితాలను సరిదిద్దేందుకే ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!