

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పలువురు పార్టీ నేతలకు ఢిల్లీ హైకోర్టు క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసులో తుది అవకాశం ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన విచారణ సమయంలో జస్టిస్ స్వర్ణకాంత శర్మను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు, వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో సమాధానాలు దాఖలు చేయడంలో ఆలస్యం కావడంపై జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ అరుణ్ భరద్వాజ్‌లతో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. మూడు వారాల్లోగా తమ వివరణలు సమర్పించాలని ఆప్ నేతలకు తుది గడువు ఇచ్చింది.
గడువులోగా సమాధానాలు దాఖలు చేయకపోతే స్పందించే హక్కును మూసివేస్తామని ధర్మాసనం హెచ్చరించింది. ఈ కేసులో కేజ్రీవాల్‌తో పాటు మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్, దుర్గేశ్ పాఠక్, వినయ్ మిశ్రా తదితరుల పేర్లు ఉన్నాయి. అవసరమైన పత్రాలు అందించినట్లు కోర్టు రిజిస్ట్రీ నివేదించిందని ధర్మాసనం పేర్కొంది. కొన్ని పత్రాలు అందలేదని నేతల తరఫు న్యాయవాదులు చెప్పగా, ఆ అభ్యంతరాలను తమ సమాధానాల్లో ప్రస్తావించవచ్చని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను 2027 జనవరి 14కు వాయిదా వేసింది. ఈ కేసులో వచ్చిన ఆరోపణలపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!