

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పారిశ్రామిక భూముల రెగ్యులరైజేషన్ పేరుతో రాష్ట్రంలోనే కాదు, దేశ చరిత్రలో కూడా ఎన్నడూ వినిపించని స్థాయిలో-- రూ.5 లక్షల కోట్ల భారీ భూ స్కామ్ జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు గుప్పించారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేటీఆర్ ఇలా అన్నారు: నగరంలోని పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరణ పేరిట సీఎం రేవంత్ రెడ్డి ఒక మేగా కుంభకోణానికి నాంది పలుకుతున్నారని తెలిపారు. మొత్తం 9,292 ఎకరాల విలువైన భూమిపై ప్రభుత్వ విధానాన్ని ప్రయోజనపరంగా మార్చి భారీ దోపిడీకి మార్గం సుగమం చేస్తున్నారని ఆరోపించారు.
కేవలం 30 శాతం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ చెల్లించి రెగ్యులరైజ్ చేసుకునే విధానం ద్వారా వేల కోట్ల ఆస్తులు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం గతంలో 100% నుండి 200% ఎస్ఆర్ఓ రేట్లు తప్పనిసరిగా చెల్లించాలని నిబంధనలు అమలు చేసిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ నిబంధనలను పూర్తిగా నీరుగార్చిందని మండిపడ్డారు.
ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలోనే ఈ భారీ స్కామ్‌కు బ్లూప్రింట్ సిద్ధమైందని, ఇప్పటికే రేవంత్ రెడ్డి సన్నిహితులు, అన్నదమ్ములు సంబంధిత భూములపై కొనుగోలు ఒప్పందాలు కూడా చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ కారణంగా ఎలాంటి సమీక్ష లేకుండా కేవలం 7 రోజుల్లో దరఖాస్తులు, మరొక 7 రోజుల్లో ఆమోదాలు, 45 రోజుల్లో రెగ్యులరైజేషన్ పూర్తి చేస్తామంటూ అత్యవసరంగా ముందుకు దూసుకెళ్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ తెచ్చిన ఈ Industrial Land Transformation Policy పూర్తిగా పార్టీకి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి నిధుల సేకరణ యంత్రంగా మారిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ స్కీములో పాల్గొనే పారిశ్రామికవేత్తలు భవిష్యత్తులో భారీ న్యాయసమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అవసరం అయితే బీఆర్ఎస్ న్యాయపోరాటానికి సిద్ధంగా ఉందని, తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ భూవినియోగాలన్నింటిపై సమగ్ర విచారణ జరిపి, సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. పారిశ్రామికాభివృద్ధి కోసం రూపొందించిన TS-iPASS విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామిక భూముల అమ్మకాల సాధనంగా మార్చిందని ఆయన ఆరోపించారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!