

దీక్షా దివస్ సందర్భంగా ఆదివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ చరిత్రను, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రాధాన్యతను గుర్తుచేశారు. 2009 నవంబర్ 29న సిద్దిపేటలో కేసీఆర్ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచిందని అన్నారు. ఈ దీక్ష తర్వాత డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు, ప్రజా ఉద్యమాలు, రాజకీయ పోరాటాలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. నవంబర్ 29ను దీక్షా దివస్‌గా జరుపుకుంటున్నట్లే, డిసెంబర్ 9ను విజయ దివస్‌గా కూడా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, గొర్రెల పంపిణీ, న్యూట్రిషన్ కిట్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు. రైతులు ధాన్యం కొనుగోళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణపైనా ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. ఇటీవల సిద్దిపేటలో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి సభకు సుమారు రూ.50 కోట్లు ఖర్చు చేశారని ఆరోపిస్తూ, సిద్దిపేటకు కనీసం 50 పైసలైనా ప్రయోజనం కల్పించారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!