

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతతో పాటు, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు టీటీడీ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ‘శ్రీవారి యాత్ర సురక్ష’ పథకం ద్వారా బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తోంది. దేశంలోనే తొలిసారిగా అమలు చేస్తున్న ఈ పథకంలో భాగంగా గత రెండు నెలల్లో తిరుమలలో సహజ మరణం పొందిన ఏడుగురు భక్తుల కుటుంబ సభ్యులకు మంగళవారం రూ.2 లక్షల చొప్పున బీమా పరిహారాన్ని అందజేశారు. టీటీడీ సాధికారిక మండలి చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ఎల్ఐసీ ఆఫ్ ఇండియా సీఈవో, ఎండీ ఆర్. దొరైస్వామి కలిసి పరిహారాన్ని అందించారు. ఈ సందర్భంగా ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ.. సెప్టెంబర్ 9న ప్రారంభించిన ఈ పథకం కింద సహజ మరణం పొందిన భక్తుల కుటుంబాలకు రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల బీమా పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. గత రెండు నెలల్లో తిరుమలలో 17 మంది మరణించగా, వారిలో ఏడుగురి కుటుంబాలకు పరిహారం అందించామని, మిగిలిన వారికి త్వరలోనే చెల్లిస్తామని వెల్లడించారు.
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. సుమారు ఏడాదిన్నర పాటు కృషి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఈ బీమా పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. భవిష్యత్తులో పరిహారాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్ఐసీ సీఈవో, ఎండీ ఆర్. దొరైస్వామి మాట్లాడుతూ.. మరణ ధృవీకరణ పత్రం, నామినీ బ్యాంకు వివరాలు అందిన వెంటనే పరిహారం చెల్లించేలా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. టీటీడీ ప్రవేశపెట్టిన ఈ పథకంపై శబరిమల ట్రావెన్‌కోర్ దేవస్థానం, జమ్మూలోని వైష్ణోదేవి ఆలయ అధికారులు కూడా ఆసక్తి చూపుతూ సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పరిహారం అందుకున్న తమిళనాడు, హైదరాబాద్, చెన్నై, గుంటూరు ప్రాంతాలకు చెందిన ఏడుగురు భక్తుల కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. కష్టకాలంలో తమకు ఆర్థికంగా అండగా నిలిచిన టీటీడీకి కృతజ్ఞతలు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!