

ఐపీఓల (IPO) గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ధరల ప్రచారంపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలకంగా స్పందించింది. జీఎంపీ ధరలను ప్రచురించడం, ప్రచారం చేయడం నిలిపివేయాలని బ్రోకరేజీ సంస్థలు, మార్కెట్ మధ్యవర్తులను హెచ్చరించింది. అనధికారిక వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాల్లో ప్రచురితమయ్యే ఈ ధరలు పెట్టుబడిదారుల్లో తప్పుడు అంచనాలను సృష్టిస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు సెబీ అడ్వైజరీ జారీ చేసింది. సాధారణంగా ఐపీఓ ప్రకటన వెలువడినప్పటి నుంచి షేర్లు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యే వరకు కొన్ని బ్రోకరేజీ సంస్థలు గ్రే మార్కెట్ ప్రీమియం ధరలను ప్రచారం చేస్తుంటాయి. అయితే వీటికి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ ఉండదని సెబీ స్పష్టం చేసింది.
బ్రోకరేజీ సంస్థలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే జీఎంపీ ధరలను కొన్ని వెబ్‌సైట్లు, వార్తాపత్రికలు ప్రచురించడం వల్ల ఇన్వెస్టర్లు అధిక అంచనాలతో పెట్టుబడులు పెడుతున్నారని సెబీ పేర్కొంది. అయితే అంచనాలకు భిన్నంగా షేర్లు తక్కువ ధరకు లిస్ట్ అయినప్పుడు వారు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గ్రే మార్కెట్ లావాదేవీలు సెబీ నియంత్రణ పరిధిలోకి రావని, వాటిలో పాల్గొనే పెట్టుబడిదారులకు ఎలాంటి నియంత్రణపరమైన రక్షణ ఉండదని వివరించింది. మోసాలు జరిగినా ఫిర్యాదు చేసే అవకాశం పరిమితంగా ఉంటుందని తెలిపింది. అందువల్ల పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీఎంపీ ధరలను ప్రామాణికంగా భావించవద్దని, అనధికారిక గ్రే మార్కెట్ లావాదేవీలకు దూరంగా ఉండాలని ఇన్వెస్టర్లకు సూచించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!