

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కేసులో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కు సుప్రీం కోర్టు పెద్ద ఊరట ఇచ్చింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా నిరాకరించింది. దీంతో ఈ వ్యవహారంలో హరీష్ రావుకు అనుకూలంగా పరిస్థితి మారింది.
ఈ కేసుకు సంబంధించిన అంశంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్ (ఎస్ఎల్పీ) ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా, ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
ఇంతకుముందు, తన ఫోన్ను అక్రమంగా ట్యాప్ చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు కాగా, దీనిని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. సరైన ఆధారాలు లేవని పేర్కొన్న హైకోర్టు, ఈ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఈరోజు జరిగిన విచారణలో జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు తీర్పులో జోక్యం అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో ఎస్ఎల్పీని స్వీకరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!