

రాష్ట్రంలోని గిగ్ వర్కర్లకు — ముఖ్యంగా ఫుడ్ డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు — శుభవార్త అందింది. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం త్వరలో ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. గురువారం సచివాలయంలో అగ్రిగేటర్లు, గిగ్ వర్కర్లు, కార్మిక సంఘాలతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి మాట్లాడుతూ, “గిగ్ వర్కర్ల సమస్యలు మాకు తెలుసు. వారికి అండగా ఉండటమే మా లక్ష్యం” అని తెలిపారు. ఈ నెల 12న జరగబోయే మంత్రివర్గ సమావేశంలో గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లుకు ఆమోదం తీసుకుని, అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు ఎలా ఇవ్వాలనే అంశంపై ప్రస్తుతం సమగ్ర సమీక్ష జరుగుతోందని చెప్పారు. “ఒక వర్కర్ ఒక గంట జొమాటోకు, మరో గంట స్విగ్గీకి పనిచేస్తే, వారికి కనీస వేతనం ఎలా లెక్కించాలి అనే దానిపై అగ్రిగేటర్లతో చర్చలు కొనసాగిస్తున్నాం,” అని మంత్రి వివరించారు.
చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అవసరమైతే మార్పులు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వేలాది గిగ్ వర్కర్లకు ఊరటనిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.










కామెంట్స్ (2)
Good step by the government.
మంచి నిర్ణయం 👍