

సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో కొత్తగా చేపల వంటకాలను ప్రభుత్వ హాస్టళ్లలో, క్రీడా పాఠశాలల్లో విద్యార్థులకు వడ్డించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పోషకాహారం పెంపు లక్ష్యంగా చేపకూరను మెనూలో చేర్చేందుకు ఇప్పటికే ప్రణాళికలు పూర్తయ్యాయి.
మత్స్యకారుల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం ఎన్నో కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టనుంది. జనవరి నుండి రాష్ట్రంలోని 6,152 సంఘాలకు చెందిన 4.21 లక్షల మత్స్యకారులకు బీమా సౌకర్యం అందుబాటులోకి రానుంది. రైతు బీమా మాదిరిగానే, ప్రమాద మరణం లేదా శాశ్వత వైకల్యం జరిగితే రూ.5 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.2.5 లక్షలు, ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చేరితే రూ.25 వేల ఆర్థిక సాయం ఇవ్వనున్నారు.
ఇటీవల మంత్రి వాకిటి శ్రీహరి బాధ్యతలు చేపట్టిన తర్వాత, మత్స్యకారుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. గత రెండు నెలలుగా రూ.93 కోట్లతో 84.62 కోట్ల చేప పిల్లలను పూర్తిగా ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటివరకు దాదాపు 60% చేప పిల్లల పంపిణీ పూర్తి అయింది.
రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఉన్న చెరువులు, ప్రాజెక్టుల్లో చేపల సాగును విస్తరించేందుకు తొలి సారిగా రూ.28 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలను 300 చెరువుల్లో వదిలారు. చేప పిల్లల పంపిణీతో సుమారు 10 లక్షల కుటుంబాలకు పరోక్ష ఉపాధి లభించనుందని అధికారులు చెబుతున్నారు.
చేపల పెంపకం పై మత్స్యకారులకు నిరంతరం శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. గత పాలనలో జరిగిన లోపాలను నివారించేందుకు ఈసారి నాణ్యమైన చేప పిల్లల పంపిణీకి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అందుకోసం మొత్తం రూ.122 కోట్లు కేటాయించారు ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే రూ.30 కోట్లు అధికం.
శాశ్వత నీటి వనరుల్లో బొచ్చు, రవ్వ, మరిగల చేప పిల్లలను 80–100 మిల్లీమీటర్ల సైజులో వదిలించగా, తాత్కాలిక నీటి వనరాల్లో 35–40 మిల్లీమీటర్ల సైజ్ ఉన్న చేప పిల్లలను స్థానిక ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు.
చేపల మార్కెట్ అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్ కోహెడలో రూ.47.03 కోట్లతో ఆధునిక చేపల హోల్‌సేల్ మార్కెట్ నిర్మిస్తున్నారు. శేరిగూడ, అర్సపల్లిలో ఒక్కొక్కటి రూ.2 కోట్లు ఖర్చుతో చేపల మార్కెట్లు నిర్మిస్తున్నారు.
మహిళ శక్తి కార్యక్రమం కింద, గ్రామ సమాఖ్యల మహిళలకు 35 మొబైల్ అవుట్లెట్లు అందిస్తున్నారు. చేపల వంటకాలు, మార్కెటింగ్ పై శిక్షణ ఇవ్వడానికి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సహకరిస్తోంది.
మత్స్యకారులకు వలలు, పడవలు, ఆధునిక పరికరాలు, రవాణా వాహనాలు త్వరలో అందించనున్నారు. చిన్న స్వదేశీ చేపల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు అస్సాం, ఒడిశాలో అమలు చేసిన విజయవంతమైన నమూనాలను అనుసరిస్తూ రూ.8 కోట్ల పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు.
మత్స్యకారుల కోసం ‘ఫిషరీస్ కిసాన్ క్రెడిట్ కార్డు’ స్కీం ప్రవేశపెట్టబడుతోంది. ఈ కార్డు ద్వారా పూచీకత్తు లేకుండా రూ.2 లక్షల వరకు రుణం పొందవచ్చు. కార్డు చెల్లుబాటు 5 సంవత్సరాలు, వడ్డీ రేటు 4% మాత్రమే.
తొలిసారిగా కరీంనగర్ జిల్లాలో రూ.2.5 కోట్లు ఖర్చుతో కొర్రమీను ఉత్పత్తి ఫార్మ్ నిర్మిస్తోంది ప్రభుత్వం. త్వరలో రాష్ట్రంలో కొర్రమీను ఉత్పత్తి భారీగా పెరుగుతుందని శాఖ అంచనా వేస్తోంది.
రాష్ట్రంలో చేపల ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసింది. "తెలంగాణ చేప" అనే ప్రత్యేక బ్రాండ్‌ను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గుజరాత్, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి వంటి రాష్ట్రాలలో చేపల సాగు పై అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాన్ని పంపనున్నారు.
మంత్రి శ్రీహరి ఇప్పటికే సమీక్షలు నిర్వహించి, తెలంగాణలో చేపల ఉత్పత్తి దేశంలోనే ఆదర్శంగా నిలవాలని అధికారులకు సూచించారు. నిధుల విషయంలో ఎటువంటి కొరత ఉండదని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!