

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమిట్‌కు హాజరయ్యే ప్రతినిధుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గ్లోబల్ సమిట్ సన్నాహాలపై బోధి పెవిలియన్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం పలు సూచనలు చేశారు. ప్రతినిధులకు ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా ప్రవేశం కల్పించాలని, అతిథులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా విధుల్లో ఉండే అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. సమిట్ ప్రాంగణంలో ఫుడ్ కోర్టులు, మెరుగైన ఇంటర్నెట్ నెట్‌వర్క్ సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రతినిధులు విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు వారికి సహకరించేందుకు ప్రత్యేక లైజనింగ్ ఆఫీసర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
సమ్మక్క సారలమ్మ ఆలయంలోని తోరణాల నమూనాలను గ్లోబల్ సమిట్ ప్రాంగణంలో వినియోగించాలని రేవంత్‌రెడ్డి సూచించారు. సమిట్‌లో భాగంగా నిర్వహించే ఎయిర్ షోతో పాటు ఇతర కార్యక్రమాలను వీక్షించే అవకాశం ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు కల్పించాలని తెలిపారు. ప్రముఖులకు ఆహ్వానాలు పంపే విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యమైన అతిథులకు ఆహ్వానాలు పంపే బాధ్యతను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబులకు అప్పగించాలని చెప్పారు. దేశ, విదేశాలకు చెందిన ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు గ్లోబల్ సమిట్‌లోని ఎడ్యుకేషన్ పెవిలియన్‌లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమిట్‌కు వచ్చే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!