

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై వేసిన అనర్హత పిటిషన్‌ను డిస్మిస్ చేయడంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని ఆయన అన్నారు. కన్నతల్లి బిడ్డను చంపడం ఎంత పాపమో, శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంతకంటే పెద్ద పాపమని వ్యాఖ్యానించారు. స్పీకర్ ఇచ్చిన తీర్పు ఫిరాయింపులను ప్రోత్సహించేలా ఉందని ఆయన ఆరోపించారు.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ టిక్కెట్‌పై ఎంపీగా పోటీ చేసినా అనర్హత వర్తించకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేసినా పార్టీ మారలేదని చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. గాంధీభవన్‌లో ఉంటూ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నా ఫిరాయింపు వర్తించకపోవడం ప్రజాస్వామ్యానికి నష్టం అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు.
స్పీకర్ తీర్పు వల్ల ప్రజలకు శాసన వ్యవస్థపై నమ్మకం తగ్గే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగ వ్యవస్థలను తన నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించాలి తప్ప రాజకీయ నాయకులకు అనుకూలంగా వ్యవహరించకూడదని చెప్పారు. స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని బండి సంజయ్ తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!