

నామినేషన్ల ఉపసంహరణ దశలో కొన్ని చోట్ల రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా మారాయి. టికెట్ దక్కకపోతే తీవ్ర నిర్ణయాలకు దిగే పరిస్థితులు తలెత్తుతున్నాయి. నల్గొండ జిల్లా చండూరు పురపాలిక 9 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా భూతరాజు లత నామినేషన్ దాఖలు చేయగా, అదే వార్డులో పలువురు మహిళలు పోటీకి దిగడంతో టికెట్ విషయంలో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆమె భర్త భూతరాజు వేణు మనస్తాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. తన భార్యకు టికెట్ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ సూసైడ్ నోట్ రాసి పోస్టు పెట్టారు. కుటుంబసభ్యులు సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
ఇదే తరహాలో జగిత్యాల 16 వ వార్డులో కాంగ్రెస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు బొల్లి శేఖర్ టికెట్ మరో వ్యక్తికి ఇస్తున్నారనే ఆవేదనతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అక్కడే ఉన్న మాజీ మంత్రి జీవన్‌రెడ్డి జోక్యంతో ప్రమాదం తప్పింది. అలాగే సూర్యాపేట 25 వ వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి కోడి శిరీషకు టికెట్ దక్కలేదన్న నిరాశతో ఆమె భర్త కోడి శివ పార్టీ జిల్లా కార్యాలయ ప్రాంగణంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. కార్యకర్తలు అడ్డుకోవడంతో ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనలు పార్టీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!