

శబరిమల అయ్యప్ప స్వామి మండల-మకరవిళక్కు యాత్రా సీజన్ ప్రారంభమైంది. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ తలుపులు తెరిచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నారు. మండల సీజన్ డిసెంబర్ 27 వరకు కొనసాగనుండగా, డిసెంబర్ 30 నుంచి జనవరి 19 వరకు మకరవిళక్కు సీజన్ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో కేరళం ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు మార్గదర్శకాలను విడుదల చేశాయి. సన్నిధానంలో రోజుకు గరిష్ఠంగా 80 వేల మందికి దర్శనం కల్పించనున్నారు. రోజుకు 18 గంటల పాటు దర్శనానికి అవకాశం ఉంటుంది. తెల్లవారుజామున 3 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా వర్చువల్ క్యూ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇందుకోసం ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోలేని వారి కోసం నీలక్కల్, ఎరుమేలి, వండిపెరియార్‌లో స్పాట్ బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో రోజుకు వరుసగా 10 వేలు, 2 వేలు, 2 వేల పాస్‌లు జారీ చేస్తారు. పంపలో స్పాట్ బుకింగ్ సదుపాయం లేదు. కేంద్రాల వద్ద ఫొటో తీసి క్యూఆర్ కోడ్‌తో కూడిన పాస్ ఇస్తారు. పంప గణపతి ఆలయం వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు, క్యూఆర్ కోడ్ తనిఖీ పూర్తయిన తర్వాతే సన్నిధానానికి అనుమతిస్తారు. నీలక్కల్-పంప మార్గంలో రోజుకు 60 వేల వర్చువల్ క్యూ టికెట్లు అందుబాటులో ఉండగా, ఎరుమేలి అటవీ మార్గం, వండిపెరియార్-సత్రం మార్గాలకు ఒక్కో దానికి 3 వేల స్లాట్‌లు కేటాయించారు.
భక్తుల భద్రత కోసం ఎర్నాకుళం, చెంగన్నూర్, తిరువళ్ల, కొట్టాయం, కాయంకుళం రైల్వే స్టేషన్లలో 24 గంటల పాటు పనిచేసే పోలీస్ హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రయాణ సమాచారం, వైద్య సహాయం, భద్రతా సేవలు అందిస్తారు. సీసీటీవీ నిఘాతో పాటు అదనపు పోలీసు బలగాలను కూడా మోహరించారు. అత్యవసర సహాయం కోసం పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 9846200100, అత్యవసర సేవల నంబర్ 112, రైల్వే హెల్ప్‌లైన్ 139ను సంప్రదించవచ్చు. మరోవైపు ప్రసాదాలు, పూజా సేవలకు దేవస్వం బోర్డు ధరలను ప్రకటించింది. అరవణ ప్రసాదం ధర రూ.100, అప్పం రూ.45, నెయ్యాభిషేకం రూ.10గా నిర్ణయించారు. గణపతి హోమానికి రూ.375, ఉషా పూజకు రూ.1,500, ఉచ్చ పూజకు రూ.3,000, నిత్య పూజకు రూ.4,000 చెల్లించాలి. లక్షార్చన, పుష్పాభిషేకం ధర రూ.12,500 కాగా, ఉదయాస్తమాన పూజకు రూ.61,800, పడిపూజకు రూ.1,37,900గా నిర్ణయించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!