

మాజీ మంత్రి హరీశ్‌రావుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని తెలంగాణ రాష్ట్ర సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రజాక్షేత్రంలో పోరాడటంతో పాటు చట్టపరంగా, న్యాయపరంగా అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సోమవారం నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. హరీశ్‌రావుకు సంబంధించిన అవినీతి ఆరోపణలపై తమ వద్ద ఉన్న ఆధారాలను సీబీసీఐడీ, కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు పంపిస్తామని తెలిపారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే, వారి హోదాతో సంబంధం లేకుండా శిక్ష పడాలన్నదే తమ విధానమని పేర్కొన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కవిత విమర్శించారు. ప్రధాని మోదీతో సమావేశమైన సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. పాంచజన్య సంకల్పంలో భాగంగా త్వరలో భైరవ వాహనంలో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఈ అంశంపై మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!