

సీఎం రేవంత్ రెడ్డి కి ఢిల్లీ లో ఖర్గే, ప్రియాంక ప్రశంసలు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అద్భుతంగా నిర్వహించారని కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని అభినందించింది. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని వారి నివాసాల్లో గురువారం స్వయంగా కలిశారు. సమ్మిట్ ముఖ్యాంశాలు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల ఒప్పందాలను వివరించారు. సమ్మిట్ విజయవంతం కావడంపై ఇద్దరూ రేవంత్‌ను ప్రశంసించారు.
ఈ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, సురేశ్ షెట్కార్, అనిల్ కుమార్ యాదవ్, పోరిక బలరాం నాయక్ పాల్గొన్నారు. సమ్మిట్‌కు ట్రంప్ ప్రతినిధి రావడం పట్ల సీనియర్ జర్నలిస్టు శేఖర్ గుప్తా తదితరులు రేవంత్‌ను అభినందించారు. అనంతరం రేవంత్ పార్లమెంట్ సందర్శించి, వివిధ పార్టీల ఎంపీలతో సమావేశమయ్యారు. అదే రోజు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన రేవంత్, దేశాభివృద్ధిలో ప్రణబ్ సేవలను స్మరించారు.
మెస్సీ మ్యాచ్‌కు రాహుల్, ప్రియాంక కు ఆహ్వానం
ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ వస్తున్నారని, ఆ కార్యక్రమానికి హాజరు కావాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ని ఆహ్వానించానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ పార్లమెంట్లో కొద్దిసేపు విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘ఈనెల 13న మెస్సీ హైదరాబాద్ వస్తున్నారు. ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవుతున్నారు. ముఖ్యమంత్రిగా నేను కూడా ఒక అతిథిగా ఆ కార్యక్రమానికి వెళుతున్నాను. అంతేతప్ప.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కార్యక్రమంతో ఎటువంటి సంబంధం లేదు. మెస్సీ ఒక ప్రముఖ క్రీడాకారుడు కాబట్టి.. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తున్నాం. మెస్సీ హాజరయ్యే కార్యక్రమానికి రావాలని రాహుల్, ప్రియాంక గాంధీలను కోరాను’’ అని రేవంత్ రెడ్డి తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!