

ప్రస్తుత అంతర్జాతీయ యుద్ధ వాతావరణంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధ నౌక మునిగిపోయిన ఘటనను ప్రస్తావిస్తూ, యుద్ధం ఇప్పుడు మన పెరట్లోకి ప్రవేశించినట్టే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఇలాంటి కీలక సమయంలో దేశానికి దృఢచిత్తం కలిగిన నాయకత్వం అవసరమని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై స్పందించడం లేదని ఆయన విమర్శించారు. అమెరికా ప్రభావానికి లోనై భారత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని మోదీ తాకట్టుపెట్టారని గురువారం ఎక్స్ వేదికగా ఆయన ఆరోపించారు.
భారత్కు చమురు సరఫరాపై కూడా ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయని రాహుల్ గాంధీ తెలిపారు. భారతదేశానికి వచ్చే చమురు దిగుమతుల్లో సుమారు 40 శాతం హోర్ముట్ జలసంధి గుండా వస్తుందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఎల్పీజీ, సీఎన్జీ సరఫరా వ్యవస్థలు మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశ భద్రత, ఇంధన సరఫరా అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!