

శాసనసభలో పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా భాజపా సభ్యుడు పైడి రాకేశ్‌రెడ్డి చేసిన ఇప్పసారా వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. గిరిజన ప్రాంతాల్లో లభించే ఇప్పపువ్వుతో తయారయ్యే సారా ఆరోగ్యకరమని, ప్రపంచంలోని దాదాపు 130 దేశాల్లో దీనిని తయారు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కూడా ఇప్పసారా తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసి మార్కెట్లోకి తీసుకురావాలని సూచిస్తూ, ఇతర పథకాల మాదిరిగా దీనికి ఇందిరమ్మ పేరు పెట్టొద్దని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, మాజీ ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మహిళలను అవమానించినట్లేనని పేర్కొంటూ క్షమాపణ కోరారు.
మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క కూడా ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భాజపా సభ్యులు తమ వాదన వినిపించే ప్రయత్నం చేయగా, కాంగ్రెస్ సభ్యులు ప్రతిఘటించడంతో సభలో గందరగోళం నెలకొని దాదాపు గంటసేపు సమావేశం నిలిచిపోయింది. ప్రొటెం స్పీకర్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి జోక్యం చేసుకుని, జీవించి లేని మాజీ ప్రధాని గురించి ఈ విధంగా మాట్లాడటం సరికాదని వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు. అనంతరం రాకేశ్‌రెడ్డి తాను తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేస్తూ, అవసరమైతే తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. స్పీకర్ ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.







.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!