

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పందించారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి టోల్‌ఫ్రీ నెంబర్లు ఇప్పటికే ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు.
సౌదీ అరేబియాలో ఇవాళ (సోమవారం) బదర్–మదీనా మధ్య ముఫరహత్ దగ్గర బస్సు–ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరణించిన వారిలో తెలంగాణకు చెందినవారు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా మక్కా నుంచి మదీనా వెళ్తున్న భారతీయ యాత్రికులే కావడం బాధాకరం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.
ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన ఆయన, రాష్ట్ర సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డిని సంప్రదించి పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. మక్కా నుంచి మదీనా ప్రయాణించే సమయంలో జరిగిన ప్రమాదమని మీడియా సమాచారం చెబుతుండగా, అందులో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారన్న వార్తలు తనను తీవ్రంగా కలచివేశాయని సీఎం తెలిపారు.
ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారో వెంటనే నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. అలాగే కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబస్సీ అధికారులతో సంప్రదించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. అవసరం ఉంటే ప్రత్యేక సహాయక చర్యలను కూడా వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
సీఎం రేవంత్ ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌ను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో తెలంగాణ వాసులు ఎంతమంది ఉన్నారన్న వివరాలను అత్యవసరంగా సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సిందిగా సూచించారు.
అంతేకాక, బాధిత కుటుంబాలకు తక్షణ సమాచారం అందించేందుకు సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. ఈ ఘటనకు సంబంధించిన ఏమైనా వివరాలు తెలుసుకోవడానికి +91 79979 59754, +91 99129 19545 నెంబర్లకు సంప్రదించాలని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!