

నిర్ణీత వయసుకు లోబడిన పిల్లలను సోషల్ మీడియా ప్రభావం నుంచి దూరంగా ఉంచేందుకు స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియా జవాబుదారీతనాన్ని బలోపేతం చేసే అంశం పై సచివాలయంలో ఏర్పాటు చేసిన మంత్రుల బృంద సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ చిన్నారుల పై సోషల్ మీడియా ప్రభావాన్ని నియంత్రించేందుకు ఇతర దేశాల్లో అమలులో ఉన్న చట్టాలు, విధానాలను లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో అమలవుతున్న వయోపరిమితి నిబంధనలను పరిశీలించి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి అనువైన మార్గదర్శకాలు రూపొందించాలని తెలిపారు.
సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మలేషియాలో డిజిటల్ ఐడీ, పాస్పోర్ట్ వివరాలతో ఈ-కేవైసీ అనుసంధానం చేసి 16 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే సోషల్ మీడియా యాక్సెస్ కల్పిస్తున్న విధానాన్ని వివరించారు. ఈ తరహా నమూనాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
చిన్నారులను సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచాలనే అంశం పై మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి వచ్చింది. అయితే ఖచ్చితంగా ఎంత వయస్సు వరకు పరిమితి విధించాలనే విషయం పై వివిధ దేశాల చట్టాలను అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఇదే సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారు, కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేష వ్యాఖ్యలు చేసే అలవాటున్న నేరస్తుల పై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ అంశాల పై చర్చించేందుకు గూగుల్, మెటా, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సంస్థల కంప్లయన్స్ అధికారులను వచ్చే మంత్రుల బృంద సమావేశానికి ఆహ్వానించాలని సూచించారు.
సోషల్ మీడియాలో ద్వేషపూరిత కంటెంట్ పై చర్యలు తీసుకునేందుకు ఐటీ యాక్ట్ సెక్షన్ 46 ప్రకారం రాష్ట్రస్థాయి అడ్జుడికేటింగ్ అధికారిని నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సహయోగ్ పోర్టల్ ద్వారా ఇప్పటికే కొన్ని కేసుల్లో చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా సైబర్ నేరాల నియంత్రణ, కంప్యూటర్ సంబంధిత నేరస్తుల పై చర్యలు, ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు వంటి అంశాల పై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!