

వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయలో నిర్వహించిన క్లైమేట్ చేంజ్ కాన్‌క్లేవ్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్, వాటర్‌మ్యాన్ రాజేంద్ర సింగ్, పద్మశ్రీ చింతల వెంకట్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సవాలుగా మారాయని అన్నారు. హైదరాబాద్‌లో రెండు గంటల్లోనే 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన ఘటనను ప్రస్తావిస్తూ, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే నెలల్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంటూ, రైతులు నీటి వినియోగం అధికంగా ఉండే పంటలకు దూరంగా ఉండాలని సూచించారు. కరువు, ఎల్‌నినో ప్రభావాన్ని రాజకీయాలకు అతీతంగా కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న తరహాలో సమష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఆహార ధాన్యాల కొరతపై ఆందోళన అవసరం లేదని, అయితే నీటి భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.
పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం తెలిపారు. నిపుణుల సూచనలతో ప్రత్యేక క్లైమేట్ పాలసీని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులు, రామప్ప, పాకాల వంటి జలవనరులను ప్రస్తావిస్తూ తెలంగాణకు గొప్ప నీటి సంరక్షణ చరిత్ర ఉందన్నారు. చెరువుల ఆక్రమణలను అడ్డుకునేందుకు హైడ్రాను ఏర్పాటు చేశామని, అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పేదలకు ఇళ్ల సహాయం అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో రెండు లక్షల డీజిల్ ఆటోలను ప్రభుత్వ ఖర్చుతో ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తామని, డీజిల్ ఆర్టీసీ బస్సులను నగరం వెలుపలకు తరలిస్తామని ప్రకటించారు. డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ ఫోర్స్, ఆహార కల్తీ నివారణకు టీజీ సేఫ్, చెరువుల పరిరక్షణకు హైడ్రా ద్వారా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో నిర్వహిస్తున్న క్లైమేట్ చేంజ్ కాన్‌క్లేవ్ తెలంగాణ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందని, పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!