

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు అధికారులు, అర్చకులు ఆలయ మహాద్వారం వద్ద పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆలయ మర్యాదలతో ఆయనను లోపలికి ఆహ్వానించారు.
సీఎంతో పాటు ఆయన భార్య నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, మనవడు దేవాన్ష్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. ప్రతి సంవత్సరం దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం, అన్నదానానికి విరాళం ఇవ్వడం వారి కుటుంబ ఆనవాయితీగా కొనసాగుతోంది. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!