

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ పట్టుదలతో వుంది. బీజేపీ నుంచి లంకల దీపన్రెడ్డిని బరిలో నిలిపారు. ప్రతి ఒక్కరి మద్దతును బీజేపీ కోరుతోంది. అయితే అధికారికంగా ఇంత వరకూ టీడీపీ మద్దతును బీజేపీ కోరలేదు. టీడీపీ కూడా తటస్థంగా వుండాలని తెలంగాణకు చెందిన తమ పార్టీ నాయకుల్ని ఆదేశించింది. అయితే టీడీపీకి మద్దతుగా నిలిచే సామాజిక వర్గం మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించి ఆశ్చర్యపరిచింది. దీంతో బీజేపీకి టీడీపీ షాక్ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. తెలంగాణలో మాత్రం రాజకీయంగా ఎంతో అవసరమున్నా టీడీపీ మద్దతును బీజేపీ అడగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో ఏపీలో కూటమిలోని మరో పార్టీ జనసేన మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి మద్దతు ప్రకటించడం విశేషం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు, కేంద్రమంత్రి కిషన్రెడ్డితో తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్, ఆ పార్టీ ఇతర నాయకులు మంగళవారం భేటీ అయ్యారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపన్రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఎన్నికలకు మరో ఆరు రోజులు గడువు ఉన్న నేపథ్యంలో మద్దతుగా ప్రచారం చేస్తామని జనసేన నాయకులు చెప్పారు. బీజేపీకి జనసేన నమ్మకమైన పార్టీగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మద్దతు ద్వారా ఆ పార్టీ నిరూపించుకున్నట్టైంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!