

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు పేరు ఖరారైనట్లు సమాచారం. మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరో ఒకటి, రెండు రోజుల్లో ఆయన అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు బీజేపీ అధిష్ఠానం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి, ఆశావహుల పేర్లను సేకరించింది. అంతర్గత సర్వేలు, రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం రాంచందర్‌రావు వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో ఆయనకు గతంలో ఉన్న అనుభవం కూడా ఎంపికకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
మరోవైపు వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీసీ అభ్యర్థిని ఎంపిక చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ స్థానం కోసం డాక్టర్ వన్నాల వెంకట రమణ, రిటైర్డ్ ఉపాధ్యాయుడు భిక్షం గౌడ్ పేర్లను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. భిక్షం గౌడ్ త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ స్థానం నుంచి సామ రామ్మోహన్‌రెడ్డి, వరంగల్–ఖమ్మం–నల్గొండ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున పాలకూరి అశోక్ గౌడ్ పేరును తీన్మార్ మల్లన్న ప్రకటించారు. బీఆర్ఎస్ మాత్రం ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. దీంతో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో రాజకీయ పోరు ఆసక్తికరంగా మారుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!