

మేడ్చల్-మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవం, నూతన జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. పార్టీ ఇప్పటికే గిరివర్ధన్ రెడ్డిని మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా నియమించింది.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బీజేపీ కుటుంబ పార్టీ కాదని, సిద్ధాంతాల ఆధారంగా దేశహితం కోసం పనిచేసే పార్టీ అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో గిరివర్ధన్ రెడ్డి చురుకుగా పనిచేశారని, కార్యకర్తలే పార్టీకి పునాదులని పేర్కొన్నారు. నాయకులు ప్రజలు, కార్యకర్తలతో అనుసంధానంగా ఉండాలని, బహిరంగంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశ భద్రత, ప్రజాస్వామ్యానికి బలం పెరిగిందని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ఈటల, రామచందర్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పూర్తిగా వివరించడం లేదని ఈటల ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం యువత, విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని రామచందర్‌రావు విమర్శించారు. రియల్ ఎస్టేట్, డ్రగ్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాల అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. 22-ఎ భూముల అంశంపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 5న ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!