

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మధ్య కొనసాగుతున్న వివాదంలో ఆసక్తికర మలుపు చోటుచేసుకుంది. తామిద్దరం ఇప్పటివరకు కలవలేదని, ‘3 ఇడియట్స్’లోని ఫున్సుఖ్ వాంగ్డు పాత్రకు వాంగ్‌చుక్ ప్రేరణ కాదని అమీర్ ఖాన్ ఇటీవల పేర్కొన్నారు. దీనిపై సోనమ్ వాంగ్‌చుక్ తాజాగా స్పందిస్తూ.. తాను అమీర్‌ను గతంలో ఓ అవార్డు కార్యక్రమంలో కలిశానని, ఇద్దరూ చాలాసేపు పలు విషయాలు, ఆలోచనలపై చర్చించుకున్నామని తెలిపారు. అమీర్ ఆ సమయంలో ‘గజినీ’ గెటప్‌లో ఉండటంతో, ఆ పాత్రలోని తాత్కాలిక మతిమరుపు వచ్చినట్లుగా తమ భేటీని మర్చిపోయి ఉండవచ్చంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
‘3 ఇడియట్స్’లో అమీర్ ఖాన్ పోషించిన ఫున్సుఖ్ వాంగ్డు పాత్ర లడఖ్‌కు చెందిన విద్యావేత్త, ఆవిష్కర్త సోనమ్ వాంగ్‌చుక్ నిజ జీవితంతో పోలికలు ఉన్నాయనే ప్రచారం చాలాకాలంగా ఉంది. అయితే ఈ సినిమా రూపొందుతున్న సమయంలో తన గురించి అమీర్ ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీకి తెలియదని అమీర్ చెప్పడంతో వివాదం మొదలైంది. అనంతరం 2008లో జరిగిన ఓ అవార్డు కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో వాంగ్‌చుక్ ప్రసంగిస్తుండగా, అమీర్ ఖాన్ ప్రేక్షకుల్లో కూర్చొని ఆయన మాటలను శ్రద్ధగా వింటున్నట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. ‘3 ఇడియట్స్ నా జీవితకథ అని నేను చెప్పడం లేదు. అయితే మన ఆలోచనలు, సంభాషణలు ఇతరులపై ప్రభావం చూపవచ్చు. నేను అమీర్‌తో చర్చించిన విషయాలు ఆయన తన రచయితలు, బృందంతో పంచుకుని ఉండవచ్చు. ఆ ప్రభావంతో సినిమాలో మార్పులు వచ్చి ఉండవచ్చు’ అని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!