

కృష్ణా–గోదావరి జల వివాదాలపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ వాదనలను తీవ్రంగా ఖండించింది. ఏపీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా మాట్లాడుతూ.. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు ఇతర బేసిన్లకు నీటి మళ్లింపును సమర్థిస్తూనే, మరోవైపు పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టులను అడ్డుకుంటోందని ఆరోపించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా ట్రైబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు ఇప్పటికే ఉన్నాయని తెలిపారు. కృష్ణా నది నుంచి ఇతర బేసిన్లకు నీటి మళ్లింపును నిలిపివేయడం చట్టపరంగా సాధ్యం కాదని, ఈ మళ్లింపులకు రెండు ట్రైబ్యునళ్ల తీర్పులు మరియు రాష్ట్ర విభజన చట్టం పూర్తి రక్షణ కల్పిస్తున్నాయని స్పష్టం చేశారు. పరీవాహకం బయటకు మళ్లించే నీటికీ అంతర్గత కేటాయింపులతో సమాన హక్కులు కల్పించాల్సిందేనని వాదించారు.
జాతీయ నీటి విధానాలు (1987, 2002, 2012)తో పాటు 2016 మార్గదర్శకాలు కూడా బేసిన్ బయటకు నీటి బదిలీలను అనుమతిస్తున్నాయని జయదీప్ గుప్తా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గోదావరి నుంచి సుమారు 240 టీఎంసీల నీటిని బయటి పరీవాహకాలకు మళ్లిస్తుండగా, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌పై అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదన్నారు. ప్రస్తుతం ఏపీ బయటి పరీవాహకాలకు మళ్లిస్తున్న నికర నీటి పరిమాణం కేవలం 157 టీఎంసీలేనని, ఇది కృష్ణా డెల్టా తాగునీటి అవసరాలు మరియు ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని వివరించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!