

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అసెంబ్లీలో హాజరు పుస్తకం ఉండదని, ఎమ్మెల్యేల హాజరును పూర్తిగా డిజిటల్ విధానంలో నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీకి హాజరయ్యే ఎమ్మెల్యేలు ఇక నుంచి రిజిస్టర్లో సంతకం చేయాల్సిన అవసరం లేకుండా, డిజిటల్ అటెండెన్స్ ద్వారా తమ హాజరును నమోదు చేయాల్సి ఉంటుందని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయానికి సంబంధించి అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ ప్రసన్న కుమార్ ఎమ్మెల్యేలకు బులిటెన్ విడుదల చేశారు.
ఇదిలా ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకుండానే హాజరు పట్టికలో సంతకాలు చేస్తున్నారన్న ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపలికి ప్రవేశించకుండానే రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో స్పీకర్ డిజిటల్ అటెండెన్స్ అమలుపై తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
ఇదే సమయంలో, రేపు అసెంబ్లీకి హాజరుకావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎల్లుండి నుంచి సభకు హాజరు అంశంపై ఇంకా స్పష్టత లేకపోయినా, రేపు వైఎస్ జగన్ కూడా అసెంబ్లీకి హాజరవుతారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!