

అమరావతి మొత్తం రాష్ట్ర ప్రజల రాజధానిగా అవతరించాలి అనే మాటలు ఇప్పటివరకు కేవలం నినాదాలుగానే మారిపోయాయా? రాజధానికోసం తమ పచ్చటి పంటచేలను ఇచ్చి సహకరించిన రైతులను ప్రభుత్వం పక్కన పెట్టేస్తుందా? ప్రస్తుతం పరిస్థితులు చూస్తే ఈ ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి.
ఒకవైపు ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను రుణాల రూపంలో తెచ్చి అమరావతి నిర్మాణాలకు ఖర్చు చేస్తున్నామని చెప్పుకుంటోంది. పనులు శరవేగంగా జరుగుతున్నాయని హర్షిస్తోంది. కానీ భూములు ఇచ్చిన రైతుల ఆందోళనలను పరిష్కరించే దిశగా మాత్రం స్పష్టమైన చర్యలు కనిపించడం లేదు.
అమరావతి రైతుల ఐక్య కార్యాచరణ సమితి మాటలు పరిశీలిస్తే—ఈ రైతులకు అన్యాయం జరుగుతున్నట్లు అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు అమరావతిలో వేల కోట్ల రూపాయల విలువైన కీలక భవనాల నిర్మాణాన్ని కొనసాగిస్తున్నా, అమరావతి పూర్తి స్థాయిలో న్యాయపరమైన సమస్యలు లేకుండా రాజధానిగా స్థిరపడిందా అనే సందేహం రైతుల్లో ఉంది.
ఈ నేపథ్యంలో అమరావతిని ఏపీ రాజధానిగా పార్లమెంటులో చట్టబద్ధం చేయాలని రైతుల ఐక్య కార్యాచరణ సమితి ప్రభుత్వం ను కోరుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధాని బిల్లును ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇప్పటివరకు ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయి నమ్మకం కల్పించలేకపోయిందనడానికి నిదర్శనం.
అదే సమయంలో, గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన మూడు రాజధానుల కేసు సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్లో ఉందని రైతులు గుర్తుచేస్తూ, ఆ కేసును తక్షణం ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. పరిపాలన మారి ఏడాదిన్నర దాటుతున్నప్పటికీ, తమ విజయానికి కీలకంగా అండగా నిలిచిన అమరావతి రైతుల అభీష్టం ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరం.
రైతుల డిమాండ్లు ఇక్కడితో ఆగడం లేదు. రాజధాని గ్రామాల్లో రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్ల సమస్యలను పరిష్కరించాలని, ఇంకా పెండింగ్లో ఉన్న కొంతమంది కౌలు రైతులకు వార్షిక చెల్లింపులను వెంటనే చేయాలని కూడా వారు కోరుతున్నారు.
చంద్రబాబు నాయుడు తమ విజయానికి పునాది వేసిన అమరావతి రైతుల సమస్యలను సహేతుకంగా పరిశీలించి, వారి డిమాండ్లను నెరవేర్చితే ప్రభుత్వం–రైతుల మధ్య నమ్మక బంధం పునరుద్ధరించవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!