తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో AIADMK పార్టీ తొలి దఫా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ ప్రధాన నేత ఎడప్పాడి కె. పళనిస్వామి (EPS) ఈ మేనిఫెస్టోను అధికారికంగా ప్రకటించారు. ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని మొత్తం ఐదు ప్రధాన హామీలతో ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు ఆయన తెలిపారు.
మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రతి మహిళకు నెలకు రూ.2,000 ను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఇప్పటికే అమల్లో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కొనసాగిస్తామని, అదే సమయంలో నగర బస్సుల్లో పురుషులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని AIADMK ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు మేనిఫెస్టోలో పేర్కొన్నారు. గ్రామాల్లో భూమిని కొనుగోలు చేసి పేదలకు కాంక్రీట్ ఇళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా, ‘అమ్మ టూ వీలర్’ పథకం కింద 5 లక్షల మంది మహిళలకు బైక్ కొనుగోలుపై రూ.25 వేల సబ్సిడీ అందిస్తామని వెల్లడించారు.
ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం 100 రోజులుగా ఉన్న ఉపాధి హామీ పనిదినాలను 150 రోజులకు పెంచుతామని AIADMK మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లేదా మే నెలల్లో జరిగే అవకాశం ఉండటంతో, ఈ మేనిఫెస్టో రాజకీయంగా కీలకంగా మారింది. ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ హామీలు ఇచ్చామని, అధికారంలోకి వస్తే తప్పకుండా అమలు చేస్తామని పళనిస్వామి భరోసా ఇచ్చారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!