

భారత్ కు తిరిగి వచ్చిన హెచ్-1బీ వీసాదారులకు అమెరికన్ వర్క్పర్మిట్ పునరుద్ధరణలో అనూహ్యమైన జాప్యం ఏర్పడింది. అమెరికా కాన్సులర్ కార్యాలయాల్లో ఇప్పటికే ఖరారైన అపాయింట్మెంట్లను అకస్మాత్తుగా రీషెడ్యూల్ చేసినట్లు The Washington Post వెల్లడించింది.
డిసెంబర్ 15 నుంచి 26 మధ్య ఉన్న అపాయింట్మెంట్లను వాయిదా వేసినట్లు సమాచారం. ఈ సమయంలో అమెరికాలో హాలిడే సీజన్ కొనసాగుతుండటం కూడా జాప్యానికి ఒక కారణంగా పేర్కొన్నారు. అయితే, మరోవైపు ఈ ఆలస్యానికి అసలు కారణం సోషల్ మీడియా వెట్టింగ్ విధానమేనని అభ్యర్థులకు ఈమెయిల్స్ పంపినట్లు ఆ పత్రిక పేర్కొంది.
United States Department of State ప్రారంభించిన కొత్త విధానంలో భాగంగా, వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను మరింత లోతుగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే విద్యార్థులు, ఎక్స్చేంజ్ వీసాలకు సంబంధించిన ఎఫ్, ఎం, జే కేటగిరీ దరఖాస్తుదారుల పై ఈ విధానం అమల్లో ఉందని వెల్లడించారు. తాజాగా హెచ్-1బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారులను కూడా ఈ పరిశీలన పరిధిలోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు.
అమెరికా విదేశాంగశాఖకు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ, గతంలో వీసా ప్రాసెసింగ్ వేగంగా పూర్తయ్యేలా, నిరీక్షణ సమయం తగ్గించడం పై దృష్టి పెట్టేవాళ్లమని తెలిపారు. అయితే ప్రస్తుతం భారత్తో పాటు అన్ని అమెరికన్ దౌత్య కార్యాలయాల్లో ప్రతి కేసును విడివిడిగా పరిశీలించి అనుమతులు ఇస్తున్నామని వెల్లడించారు.
అమెరికాలో ఉద్యోగం చేయడానికి జారీ చేసే ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) ను సాధారణంగా వర్క్పర్మిట్గా పిలుస్తారు. ఈ ప్రక్రియలో జాప్యం కొనసాగడంతో పలువురు వీసాదారులు అనిశ్చితి పరిస్థితుల్లో ఉన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!