

హర్మూజ్ జలసంధి ప్రాంతంలో నౌకల రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితుల్లో ఇరాన్ సైన్యం ఒక సంచలన వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం హర్మూజ్ సమీపంలో తమ వద్ద సూసైడ్ (కామికాజీ) డ్రోన్ బోట్లు మరియు భూగర్భ మిస్సైల్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ పేర్కొంది.
ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ ప్రసారం చేసిన వీడియోలో ఒక పొడవైన భూగర్భ బంకర్లో పెద్ద సంఖ్యలో సూసైడ్ డ్రోన్ బోట్లు వరుసగా నిల్వ ఉంచిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అదే బంకర్లో యాంటీ-షిప్ మిస్సైళ్లు, సముద్ర మందుపాతరలు కూడా ఉన్నట్లు వీడియోలో గమనించవచ్చు.
మరో వీడియో ఫుటేజీలో పలు రకాల ఆయుధాలను ప్రయోగిస్తున్న దృశ్యాలు కూడా కనిపించాయి. అయితే ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించబడింది, ఎక్కడ తీసారు అనే వివరాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇరాన్‌పై అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఈ వీడియో తీసారా లేదా అంతకుముందే తీసారా అన్నది కూడా స్పష్టత రావాల్సి ఉంది. నేవల్ డ్రోన్లను అన్మ్యాన్డ్ సర్ఫేస్ వెహికల్స్ (USV) అని కూడా పిలుస్తారు. ఇవి చిన్న పరిమాణంలో ఉండే నౌకలు. సముద్ర ఉపరితలంపై లేదా కొద్దిగా నీటి అడుగున ప్రయాణించే సామర్థ్యం వీటికి ఉంటుంది.
ఈ డ్రోన్ బోట్లలో పేలుడు పదార్థాలు అమర్చబడి ఉంటాయి. ఇవి లక్ష్యాన్ని తాకగానే పేలిపోతాయి. ఇటీవల పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో రెండు ఆయిల్ ట్యాంకర్లపై జరిగిన దాడుల్లో కూడా ఇలాంటి నేవల్ డ్రోన్లను ఉపయోగించినట్లు సమాచారం. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఆయిల్ ట్యాంకర్లు మరియు ఇతర నౌకలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాన్ ఈ డ్రోన్ బోట్లు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!