

మేడారం సమ్మక్క – సారలమ్మ మహా జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మహా జాతర జరగనుండగా, దాదాపు నెల రోజుల ముందే మేడారానికి భక్తుల రాక మొదలైంది. రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతుండగా, ఒక్క రోజే సుమారు 6 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం పూర్తిగా కిక్కిరిసిపోయింది. ప్రతి దిక్కు నుంచి భక్తుల రాకతో మేడారం పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.
భక్తుల భారీ రాకతో ములుగు గట్టమ్మ తల్లి ఆలయం వద్ద తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జాగారం నుంచి మేడారం వరకు వాహనాల రద్దీ కొనసాగుతోంది. కన్నెపల్లి, జంపన్నవాగు, హరిత హోటల్ ప్రాంతాల వరకు ట్రాఫిక్ నిలిచిపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు వాహనాలను పొలాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాలకు మళ్లిస్తున్నారు.
మహా జాతర రోజులు దగ్గరపడుతున్న కొద్దీ భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!