

సంక్రాంతి పండగ తరవాత మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 16 న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పర్యటన ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా బహిరంగసభలో ప్రసంగిస్తారు. అదే రోజు సదర్మాట్ బ్యారేజీ ప్రారంభం, చనాఖా–కోర్ట ప్రాజెక్టు సందర్శన కూడా ఉండనుంది. ఈ కార్యక్రమాలతోనే మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 3 న జడ్చర్లలో నిర్వహించే బహిరంగ సభతో ప్రచారం ప్రారంభించాలని అనుకున్నా సమయం సరిపోదని.. అంతకన్నా ముందే జరపాలని తాజాగా నిర్ణయించారు.
ఈ నెల 17న జడ్చర్లలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి, మహబూబ్‌నగర్‌లో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేసి బహిరంగ సభలో మాట్లాడతారు. 18 న పాలేరులో అభివృద్ధి కార్యక్రమాల అనంతరం ఖమ్మం పట్టణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని, సీపీఐ వందేళ్ల సభకు హాజరవుతారు. అనంతరం ములుగు జిల్లా మేడారంలో రాత్రి బస చేస్తారు. 19 న ఉదయం సమ్మక్క – సారలమ్మ గద్దెలను ప్రారంభించి మొక్కులు తీర్చుకుని హైదరాబాద్‌కు చేరుకుంటారు. అదే సాయంత్రం దావోస్‌కు వెళ్లి, అక్కడి నుంచి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఫిబ్రవరి 1 న తిరిగి హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ వివరాలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఫిబ్రవరి 3 నుంచి హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలు నిర్వహించనుంది. ఒక్కోచోట లక్ష మందితో సభలు నిర్వహించి మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం వార్డులు, ఛైర్మన్ పదవులు గెలవడమే లక్ష్యంగా ప్రచారం సాగించనుంది. ఈ సభల పర్యవేక్షణ బాధ్యతలను ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులకు అప్పగించేందుకు పీసీసీ ప్రణాళికలు రూపొందించింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం మంత్రుల జాబితాను ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!