

ఇరాన్లో కొనసాగుతున్న హింసాత్మక నిరసనల నేపథ్యంలో వాణిజ్య విమానాల రాకపోకలకు ఆ దేశం గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. దీనివల్ల భారత విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి. ఎయిర్ ఇండియా తన ప్రకటనలో, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రతే ప్రధాన ప్రాధాన్యమని పేర్కొంది. ఇరాన్ మీదుగా వెళ్లాల్సిన కొన్ని విమానాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లిస్తున్నామని, అలాంటి మార్గాలు సాధ్యం కాని కొన్ని సర్వీసులను రద్దు చేస్తున్నామని వెల్లడించింది. ప్రయాణికులు ఎప్పటికప్పుడు అప్డేట్లు పరిశీలించాలని కోరింది.
ఇండిగో విమానయాన సంస్థ కూడా ఇదే తరహా అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్ గగనతలం మూసివేత కారణంగా కొన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రభావం పడిందని, పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల్లో సర్వీసులు నడుపుతున్నామని తెలిపింది. ఇదిలా ఉండగా, ఇరాన్లో నిరసనలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారగా, ఆ దేశంపై సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అప్రమత్తమై, ఇరాన్లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో దేశాన్ని వీడాలని, భారతీయులు ఎవరూ ఇరాన్‌కు వెళ్లవద్దని సూచించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!