

ఇండిగో ఎయిర్లైన్స్ సీఈఓ పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలికంగా సంస్థ బాధ్యతలు చేపట్టారు. వ్యక్తిగత కారణాలతో పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన రాజీనామాను ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ బోర్డు ఆమోదించినట్లు జాతీయ మీడియా తెలిపింది. అలాగే వెంటనే పదవి నుంచి తప్పుకోవడానికి నోటీసు పీరియడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని చేసిన అభ్యర్థనను కూడా బోర్డు అంగీకరించింది. 2022 లో పీటర్ ఎల్బర్స్ ఇండిగో సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. కొత్త సీఈఓ నియామకం జరిగే వరకు రాహుల్ భాటియా సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు.
గత ఏడాది డిసెంబర్లో ఇండిగో కార్యకలాపాల్లో పెద్ద ఎత్తున ఆటంకాలు చోటుచేసుకున్నాయి. డిసెంబర్ 3 నుంచి 5 వరకు సుమారు 2,507 ఫ్లైట్లు రద్దయ్యాయి, అలాగే 1,852 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఈ సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పైలట్ల విధులకు సంబంధించిన కొత్త నిబంధనలను అమలు చేసే విషయంలో సంస్థ సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
ఈ ఘటన తర్వాత డీజీసీఏ ఇండిగో శీతాకాల విమాన షెడ్యూల్ను 10 శాతం తగ్గించింది. అలాగే ఈ ఏడాది జనవరిలో సంస్థపై రూ.22 కోట్ల జరిమానా విధించింది. వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి రూ.50 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలని కూడా ఆదేశించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!